జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఎన్నికలు ముగిసే వరకు జమ చేయవద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. ఈ నెల 14 వరకు నగదు జమ చేయవద్దని తెలిపింది. పలు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈమేరకు ఈసీ అనుమతి కోరింది. అయితే.. ఈసీ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినా.. కోర్టు కూడా అనుమతించకపోవడంతో వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లైంది.
డివిజనల్ బెంచ్ లో అప్పీల్ పై విచారణను వేసవి సెలవుల అనంతరంకు వాయిదా వేసింది ధర్మాసనం. ఇప్పుడు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఇప్పటికే సింగిల్ జడ్జి ఉత్తర్వుల సమయం అయిపోయిందని బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ జడ్ది ఉత్తర్వుల ప్రకారం ఈనెల 11, 12, 13 తేదీలలో నిధుల విడుదల చేయవద్దని ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేసింది.
ఇదంతా కూడా అకాడమిక్ మేటర్ అని ధర్మాసనం వ్యాఖ్యనించింది. ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు గురించి కూడా ఆరా తీసింది ధర్మాసనం. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది. లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమపై సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది.