ఇటీవలి జరిగిన ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి రోజా ఈ రోజు ట్వీట్ చేశారు. 'చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ, మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!' అంటూ ఆమె 'X'లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రోజా 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి రెండున్నరేళ్లు ఆమెకు మంత్రి పదవిని అప్పగించారు జగన్.
రాజకీయ ప్రత్యర్థులపై తాన మాటలతో విరుచుకుపడుతూ.. ఫైర్ బ్రాండ్ గా రోజా పేరు తెచ్చుకున్నారు. అనేక సార్లు ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గత ఐదేళ్లు టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ అనేక సార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యారు. అయితే.. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో మరోసారి నగరి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రోజా దాదాపు 45 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఫలితాలపై కూడా స్పందించలేదు. టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో రోజాపై కామెంట్లు చేసినా.. ఆమె రెస్పాండ్ కాలేదు. తాజాగా.. 'తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం' ఆంటూ ఆమె ట్వీట్ చేశారు. దీంతో రోజా మళ్లీ పాలిటిక్స్ లో యాక్టీవ్ కానున్నట్లు తెలుస్తోంది.