సొంత నియోజకవర్గం పులివెందులకు రేపు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చేపట్టిన తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. రేపు మధ్యాహ్న 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకోనున్నారు. తిరిగి 21న ఆయన మళ్లీ తాడిపత్రికి చేరుకుంటారు. 22న ముఖ్యనేతలతో జగన్ సమావేశం అవుతారు. జగన్ తన పర్యటనలో ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది.
వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. టీడీపీ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. జిల్లాలోని రాజంపేట, కడప పార్లమెంట్ సెగ్మెంట్లలో మాత్రం వైసీపీ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో జగన్ సొంత జిల్లాలో పార్టీ ఎందుకు ఓటమిపాలైంది? మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఏం చేయాలి? అన్న అంశంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు సొంత జిల్లాలో పర్యటనకు వెళ్తున్నారన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.