ఏపీ మాజీ సీఎం జగన్ బెంగళూరు టూర్ ముగిసింది. దాదాపు 10 రోజుల తర్వాత తాడేపల్లికి జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి వచ్చిన జగన్ కు గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఎన్నికల తర్వాత ముఖ్య నేతలు, అభ్యర్థులతో వరుస భేటీలు నిర్వమించారు జగన్. అనంతరం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అక్కడి నుంచి గత నెల 24న బెంగళూరుకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ రోజు తాడేపల్లికి చేరుకున్నారు.
దీంతో జగన్ ఇక పార్టీ కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటిన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణను జగన్ రూపొందించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఓటమితో డీలా పడిపోయిన పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపేలా ఆయన స్కెచ్ ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. ఈ డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించాలన్నది జగన్ ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న ఘర్షణల్లో గాయాలపాలైన పార్టీ నేతలు, కార్యకర్తలను ఈ యాత్ర ద్వారా జగన్ కలిసి వారిలో ధైర్యం కల్పించాలన్నది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.