అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఉండేది అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమేనన్నారు. అయినా.. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించరట..? అంటూ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే.. మైక్ హక్కుగా ఇవ్వాల్సి వస్తుందన్నారు. సభా నాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి అంతే టైమ్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. మాకు అవకాశం ఇస్తే ప్రజల పక్షాన నిలదీస్తామనే ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించొద్దన్నది దుర్మార్గమైన ఆలోచన అని విమర్శించారు.
అసెంబ్లీలో గొంతు విప్పినా.. విప్పలేకపోయినా.. అసెంబ్లీ జరిగే సమయంలో ఇలానే ప్రజల తరఫున మీడియాలో మాట్లాడుతానన్నారు. జగన్ వ్యాఖ్యలతో ఆయన ఇక అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న చర్చ మొదలైంది. సభకు దూరంగా ఉండి ప్రెస్‌మీట్లతోనే జగన్ తన వాదన వినిపించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.