Chandrababu Vs YS Jagan: అది 2013 సెప్టెంబర్ 24.. సమయం సాయంత్రం నాలుగు గంటలు.. ప్రాంతం చంచల్‌గూడ సెంట్రల్ జైలు.. అక్రమాస్తుల కేసులో 16నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ బెయిల్‌పై బయటకొచ్చిన క్షణమది..! యావత్ వైసీపీ అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టిన నిమిషాలు అవి..! బెయిల్‌పై జగన్ బయటకు వచ్చిన నాటి నుంచి ఈ 11ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరిగాయి.. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయింది.. జగన్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఐదేళ్లు గడిపింది... ఆ తర్వాత జగన్ సీఎంగా (Jagan As CM) ఐదేళ్లు పాలించారు..! సీన్ కట్ చేస్తే.. అసలు ఏపీలో జగన్ పార్టీకి అడ్రెసే లేకుండా పోయింది.. సీఎంగా ఉండడంతో ఇన్నాళ్లు కేసుల విచారణకు నేరుగా హాజరుకాని జగన్‌కు ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆయన జైలుకు వెళ్లడం మరోసారి ఖాయమన్న ప్రచారమూ జరుగుతోంది. ఇంతకీ జగన్‌కు మరోసారి జైలు జీవితం తప్పదా? అసలు జగన్ కేసుల కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో (llegal Assets Case) జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న 2004-2009 సమయంలో జగన్ అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. భూములు, వివిధ ప్రాజెక్టులు, లైసెన్సులు రియల్ ఎస్టేట్ అనుమతులను తనకు నచ్చినవారికి జగన్ కేటాయించేలా చేశారని.. అందుకు బదులుగా సంబంధిత కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలున్నాయి.
జగన్‌పై సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్‌ను (CBI Filed FIR) 2011లో నమోదు చేసింది. తొలిఛార్జిషీట్ ను 2012 జనవరి 21న దాఖలు చేసింది. అయితే.. అప్పటి నుంచి నేటి వరకు ఆ కసు ఎటూ తేలలేదు. వాయిదాలు, ఛార్జిషీట్లు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు ఇలా 13 ఏళ్లుగా ఈ కేసు ఎటూ తేలక కొనసాగుతూనే ఉంది. అయితే 2024లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ కేసుల్లో విచారణ వేగం పెగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. దానికి అనేక కారణాలు వినిపిస్తున్నారు విశ్లేషకులు!
నిజానికి 2019కు ముందు జగన్ (YS Jagan) సీఎంగా లేని సమయంలో ప్రతీ శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా జగన్ సీబీఐ కోర్టులకు హాజరుకాలేదు. దీనికి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవడంతో సీబీఐ కూడా ఏం చేయలేకపోయింది. అయితే ఇప్పుడు వైసీపీకి (YCP) కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ హాజరు మళ్లీ తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. జూన్ 19 నుంచి సీబీఐ జగన్ కేసుల విచారణను చేపట్టనుంది న్యాయస్థానం.
ఇక 2014లో టీడీపీ-బీజేపీ కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 2018నాటికి చంద్రబాబు (Chandrababu) బీజేపీతో విభేదించి కమలం పార్టీకి వ్యతిరేకంగా మారారు. ఈ సమయంలో జగన్ బీజేపీతో ఎంతో సఖ్యతగా మెలిగారు. అటు 2019లో వైసీపీ గెలిచిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీతో (BJP) మంచి రిలేషన్ మెయింటెయిన్ చేశారు. ఇది జగన్‌ను కేసుల నుంచి కాపాడగలిగిందని చెబుతారు విశ్లేషకులు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీయే కూటమికి కింగమేకర్‌గా నిలిచారు. బీజేపీ మ్యాజిక్ మార్కును దాటలేకపోవడంతో చంద్రబాబు ఏం చెప్పినా కేంద్రం వినే ఛాన్స్ ఉంటుందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక 2023లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో (AP skill Development Scam Case) చంద్రబాబు అరెస్ట్ అవ్వడాన్ని మరువద్దని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు 2017 నుంచి కోడి కత్తి కేసు కోర్టుల్లో నలుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీను ఇటివలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన NIA కోర్టుల్లో జరిగిన విచారణకు జగన్ గతంలో హాజరుకాలేదు. ఇప్పుడు సీఎం పదవి లేకపోవడంతో ఈ కేసులో బాధితుడిగా ఉన్న జగన్‌ను కోర్టు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జగన్‌కు చికాకు పెట్టే విషయంగా తెలుస్తోంది. ఎందుకంటే సీఎంగా ఉన్నన్ని రోజులు కోర్టు కేసులకు హాజరుకాని జగన్.. ఇప్పుడు పదేపదే కోర్టు మెట్లక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ పరిణామాలు చివరకు జగన్‌ను మరోసారి జైలు పాలు చేసేలా కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.!