ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులను దాదాపు అన్ని పార్టీలు ప్రకటించాయి. అయితే.. ప్రజల్లో వారికి వస్తున్న ఆదరణ ఆధారంగా పలు మార్పులు చేర్పులు చేయాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మాడుగుల అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అక్కడి నుంచి బరిలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: MP Venkatesh Netha: బీజేపీ సంచలన నిర్ణయం.. ఎంపీ అభ్యర్థి మార్పు?
వాస్తవానికి బండారు పెందుర్తి సీటును ఆశించారు. అయితే.. పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దీంతో బండారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం విశాఖ పర్యటనలో బండారును సముదాయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయినా.. బండారు సత్యనారాయణ వెనక్కి తగ్గలేదు.
రెండు మూడు నియోజకవర్గల్లో ప్రభావం చూపే బండారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే నష్టం జరుగుతుందని భావిస్తున్న టీడీపీ ఆయనను మాడుగుల అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టికెట్ ను పైలా ప్రసాద్‌కు టీడీపీ కేటాయించింది. అక్కడ అసమ్మతి కారణంగా ఆయనను తప్పించి బండారుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.