RRR : రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) ను ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దించాలని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) నిర్ణయించారు. ఈ విషయాన్ని రఘురామ స్వయంగా ప్రకటించారు. ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను బలి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకు రామరాజు సహకరిస్తారా? లేక ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu : ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు, ఆయన భార్య ఆస్తులు!
ఈ నేపథ్యంలో రామరాజు కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే రఘురామరాజుకు ఇబ్బందులు తప్పవన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. వైసీపీ(YCP) నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు.. తాను విజయం సాధించిన కొన్ని రోజులకే పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ సంచలనం సృష్టించారు.
ఈ క్రమంలో ఆయన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు దగ్గరయ్యారు. ఆయా పార్టీల నేతలతో సన్నిహితంగా ఉన్నారు. ఏపీలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో కూటమి నుంచి రఘురామకు టికెట్ ఖాయమన్న ప్రచారం సాగింది. అయితే.. అనూహ్యంగా బీజేపీ నరసాపురం నుంచి వేరే అభ్యర్థికి టికెట్ ఖరారు చేసింది. దీంతో రఘురామ రాజకీయ భవిష్యత్ ఏంటి? అన్న అంశంపై తీవ్ర చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. చివరికి ఉండి టికెట్ దక్కించుకున్నారు.