టీడీపీ నుంచి రఘురామకృష్ణంరాజు బరిలో ఉన్న ఉండి నియోజకవర్గంలో రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారు అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఓటర్లు అర్థరాత్రి వరకు క్యూలైన్లో బారులుదీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ భారీగా.. 82 శాతం పోలింగ్ నమోదైంది.
దీంతో ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం అన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు వైపే 4 మండలాల రూరల్ ఓటర్లు ఉన్నారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. ఇంకా టీడీపీ అభ్యర్థి రఘురామకు ఎస్సీ సామజిక వర్గం నుంచి పెద్దగా మద్దతు లేదన్న అభిప్రాయం సైతం ఉంది. ఎస్సీ ఓట్ బ్యాంక్ వైసీపీ అభ్యర్థి నరసింహరాజు వైపే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సైలెంట్ ఓటింగ్ తో పరిస్థితి అర్థం కాక ప్రధాన అభ్యర్థుల వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోంది. అయితే.. ఉండి నుంచి బరిలో ఉన్న వారిలో ముగ్గురు అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం మరో ఆసక్తికర అంశంగా మారింది. అంచనాలకు అందని సైలెంట్ ఓటింగ్, హోరాహోరీ పోటీ నేపథ్యంలో ఉండి కింగ్ ఎవరనేది తేలాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే!