ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటింగ్ లో పాల్గొనడం తమకే అనుకూలమని వైసీపీ సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ను మరో సారి సీఎం చేయాలన్న లక్ష్యంతో ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చొని ఓటు వేశారన్నారు. కులాలు, మతాలకు అతీతంగా 70 శాతం మహిళలు జగన్ కు అండగా నిలిచారన్నారు. మహిళా సాధికారతకు జగన్ చేసిన కృషే ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ పాజిటీవ్ ఓటు ఇంత పెద్దగా ఉండడం చరిత్రలో ఇది తొలిసారి అని అన్నారు. సత్తెనపల్లిలోనూ భారీ మెజార్టీతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నిన్న ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో భారీగా హింస జరగడం బాధాకరమన్నారు. పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైందని విమర్శించారు. వాళ్లు ఫెయిల్ అయ్యారా? లేక టీడీపీతో కుమ్మక్కు అయ్యారా? అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాను బయటకు తిరగొద్దంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చి.. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను తిరగనివ్వడం ఏంటని ప్రశ్నించారు.
కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కూడా తిరిగాడన్నారు. రాంబాబు అనే సీఐ టీడీపీకి అమ్ముడుపోయి టీడీపీకి సపోర్ట్ చేశాడన్నారు. తనకు అనుకూలంగా ఉండే బూత్ లలో ఎక్కువ మంది పోలీసులను, టీడీపీకి అనుకూలంగా బూత్ లలో ఒక్కరిని పెట్టాడన్నారు. కొన్ని చోట్ల పోలీసులే బలవంతంగా టీడీపీకి ఓటు వేశారన్నారు. తన అల్లుడిపై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈసీ సిన్సియర్ గా పని చేసే పోలీస్ అధికారులను మార్చిందని ఆరోపించారు.
ఆర్తనాదాలు చేస్తున్న వైసీపీ కార్యకర్తల రక్షణకు పోలీసులను పంపించే పరిస్థితులో తాము ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు సైతం చేసినట్లు చెప్పారు.వెబ్ కెమెరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతే కానీ.. రీపోలింగ్ నిర్వహించమని చెప్పడం సరికాదన్నారు.