AP Nominations: ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్ధులు ఆయా కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
రెండు స్థానాల్లో మాత్రమే..
ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారన్నారు. అభ్యర్ధితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
Also Read: బోండా ఉమాపై రాజకీయ కుట్ర.. జగన్ దాడికి అతడికి సంబంధం లేదు.. వర్ల రామయ్య లేఖలు
పోటీ చేసే అభ్యర్ధులు పార్లమెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సిసి కెమేరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
*అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురాలి.
*పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారమ్ 2బి లో ధరఖాస్తు చేయాలి.
*నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.
*పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
*అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
*నామినేషన్లను ఆర్ఓ కు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్రమే సమర్పించాలి.
*అభ్యర్ది తన నామినేషన్‌ను నేరుగా గానీ, తన ప్రపోజర్ ద్వారా గానీ సమర్పించవచ్చు.
*అభ్యర్ధి నామినేషన్‌తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి.
*2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.