ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు (Kottu Sathyanarayana) ఈ సారి టికెట్ డౌన్ అనే చర్చ సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నుంచి ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లోనూ కాంగ్రెస్ నుంచి మరో సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2017 లో వైసీపీలో చేరి 2019 లో రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2021 లో ఆయనకు జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని కొట్టు కోరుతున్నారు. ఇప్పటికే విశాల్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఇది కూడా చదవండి: AP Politics: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు
ఇదే సమయంలో తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి కాపు సామాజిక వర్గం నుండే అభ్యర్థిని పోటీ చేయించేందుకు వైసీపీ సిద్ధం అవుతోందని తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి గా ఉన్న కొట్టు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నిర్వహణ సమయంలో సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది.
ఇది కూడా చదవండి: Job Mela in AP: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 750 ఉద్యోగాలు.. ఈ నెల 19న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!
సొంత క్యాడర్ లో వ్యతిరేకత ఉండటంతో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటంతో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. దీంతో ఈ సారి ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న సీఎం జగన్.. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 14 స్థానాల్లో ఆయన కొత్త వారికి ఇన్ ఛార్జులుగా నియమించారు.