ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. సునీల్ కుమార్ ను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రిశాంత్ రెడ్డిని కౌంటర్ ఇంటెలీజెన్స్ ఎస్పీ బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్ కు, శంకబ్రత బాగ్చీకి ఫైర్ సేఫ్టి డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో వీరు వైసీపీకి అనుకూలంగా పని చేసి టీడీపీని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో టీడీపీ టార్గెట్ గా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు అనేక సార్లు ఆరోపించారు. ఇంకా రిశాంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీగా ఉన్న సమయంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. డీజీపీగా పని చేసిన సమయంలో రవీంధ్రనాధ్ రెడ్డి వైసీపీకి పూర్తిగా అనుకూలంగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయనను ఈసీ పక్కకు పెట్టింది. డీజీపీ బాధ్యతల నుంచి తప్పింది. దీంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆయనకు అంతగా ప్రాధాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టు అప్పగించింది.