2019 ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర బీజేపీ నేతల నుంచి సరైన సహకారం అందలేదు. కేంద్ర పెద్దలతో సంబంధాలు మెరుగ్గా ఉన్నా.. రాష్ట్ర నేతలతో మాత్రం తనకు పెద్దగా సంబంధాలు లేవని ఇప్పటికే పలు సార్లు తెలిపారు. తనతో బీజేపీ నేతలు కలిసి రావడం లేదని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తిరుపతి ఉపఎన్నికల్లో మాత్రమే రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. అప్పటినుంచి ఉమ్మడిగా పోరాటం చేసిన దాఖలాలు లేవు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఒక్కడే గట్టిగా పోరాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తనతో బీజేపీ నేతలు సంప్రదించడం లేదన్నారు. అధికారంలోకి రావడం కోసం కావాల్సిన రూట్ మ్యాప్ గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు.
ఇకపై పవన్‌తో వరుస సంప్రదింపులు..
జనసేనతో తమ బంధంపై తాజాగా పురందేశ్వరి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకుముందు లాగా ఉండదని.. పవన్‌తో ఇకపై వరుసగా సంప్రదింపులు ఉంటాయని స్పష్టంచేశారు. అంతేకాదు ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుందన్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో ఫోన్లో మాట్లాడానని.. త్వరలోనే నేరుగా భేటీ అవుతానని తెలిపారు. ప్రభుత్వంపై పోరాటం విషయంలో సందర్భానుసారం ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో మరింత బలోపేతం దిశగా తమ ప్రణాళికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక టీడీపీతో పొత్తుకు పవన్ కల్యాణ్ సుముఖంగా ఉన్నారనే దానిపై కూడా ఆమె తనదైన శైలిలో స్పందించారు. పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పురంధేశ్వరి.. ఏపీలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అన్నారు.
ఢిల్లీలో బిజీబిజీగా పవన్ కల్యాణ్..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే వారాహి యాత్రలో సీఎం జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను అధికారంలో నుంచి దించకపోతే తన పేరు పవన్ కల్యాణ్ కాదని శపథం కూడా చేశారు. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తుపై కేంద్ర పెద్దలతో మరోసారి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. సోమవారం జరిగిన ఎన్డీయే సమావేశంలోనూ పాల్గొన్నారు. పొత్తుల అంశంపై మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు. తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధరన్‌తో భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తన ఢిల్లీ పర్యటనలో మరికొందరు బీజేపీ పెద్దలను పవన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.