/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/leapard-jpg.webp)
Tirumala leopard: తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. లక్ష్మీనరసింహ ఆలయం సమీపంలో నిన్నరాత్రి చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు. బాలిక లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో చిరుత సంచరించినట్టు తెలుస్తోంది. ట్రాప్ కెమెరాలలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వన్యమృగాలు సంచారంపై అటవీశాఖ మానిటరింగ్ కొనసాగుతుంది. భక్తులు జాగ్రత్తగా రావాలని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. గుంపులు గుంపులుగా రావాలని విజ్ఞప్తి చేశారు.
ఆపరేషన్ చిరుత ముగియలేదా?
గత ఆదివారం రాత్రి తిరుమలలో అటవీశాఖ అధికారులు నాలుగో చిరుతను పట్టుకోవడంతో కొండపైన ఆలయానికి వచ్చిన భక్తులకు ఊరట లభించింది. నాలుగో చిరుతను విజయవంతంగా పట్టుకోవడం తిరుమలలో ఆపరేషన్ చిరుతపులి ముగింపును సూచిస్తుందని అధికారులు ప్రకటించారు. 7వ మైలు ప్రాంతం వద్ద చిరుతను బోనులో బంధించారు. ఇక భక్తులు అందరూ ఎలాంటి ఆందోళన చెందకుండా అలిపిరి మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇంతలోనే మరోసారి చిరుత కనిపించడం కలకలం రేపింది.
తిరుమలలో చిరుతల సంచారం గతంలో ఉన్నా ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షిత మృతి తర్వాత అన్నివైపుల నుంచి టీటీడీపై అనేక విమర్శలు వచ్చాయి. అంతకముందు కూడా కౌశిక్ అనే బాలుడిని చిరుత గాయాలు పాలు చేయడం టీటీడీపై విమర్శల దాడి పెరగడానికి ప్రధాన కారణం. ఇలా వరుస పెట్టి ఘటనలు జరుగుతుండడంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర నుంచి స్పెషల్‌గా బోనులను తెప్పించింది. వాటిలోనే చిరుతపులులు చిక్కాయి. జూన్ 24న మొదటి చిరుత, ఆగస్ట్ 14న రెండో చిరుత, ఆగస్ట్ 17న మూడో చిరుత చిక్కింది. ఆగస్టు 28న నాలుగో చిరుత కూడా చిక్కడంతో నడకమార్గంలో చిరుతల బెడదకు చెక్ పడినట్టుగానే అధికారులు భావించారు. కానీ మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. అది కూడా లక్షిత మృతి చెందిన ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్టు తెలియడం భక్తులను భయపెడుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన లక్షిత గత ఆగస్టు 11 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు దినేష్, శశికళ ఆమె కోసం ఎంత వెతికినా టీటీడీ అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా తర్వాతి రోజు ఉదయం నరసింహస్వామి ఆలయం వెనుక బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
ALSO READ: సీఎం చేతుల మీదుగా శ్రీనివాససేతు ప్రారంభోత్సవం.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు!