తిరుమల తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేగింది. సోమవారం రాత్రి శ్రీవారి మెట్ల వద్ద నుంచి ఓ చిరుత రోడ్డు దాటుతూ కనిపించిందని కొందరు భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులు కారులో వెళ్తుండగా..పులి కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాల్లో ఎలాంటి చిరుత కదలికలు లేవని చెబుతున్నారు. చిరుత సంచారం పై టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలినడన వెళ్లే భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపివేసి భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు.
అంతేకాకుండా భక్తుల చేతికి కర్రలు అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో చిరుత సంచారంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. . నడక మార్గంలో గత కొద్ది రోజులుగా చిరుత, ఇతర క్రూర జంతువుల సంచారం ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.
అటు అలిపిరి మార్గంలోనూ, ఇటు శ్రీవారి మెట్ల మార్గం వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. చిరుతలు మాత్రమే కాకుండా ఎలుగుబంట్లు కూడా భక్తులకు నడక మార్గంలో కనిపిస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
Also read: వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్.. కార్తీకమాసం సందర్భంగా అధికారుల కీలక ప్రకటన