Annamaiah District: చిరుత సంచారంతో అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చెర్లోపల్లి వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. సమీపంలోనే చిరుత తిరుగుతోందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఊరంతా భయంభయంగా గడుపుతోంది. గ్రామ శివారు ప్రాంతంలో చిరుత సంచారంపై ఆధారాలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మొదట ఇద్దరు వ్యక్తులు ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడాన్ని గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్
హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు చిరుత సంచరించిందని చెప్తున్న ఆ ప్రాంతంలో కాలి ముద్రలను పరిశీలించారు. వాటిని సేకరించి నిర్ధారణ కోసం నమూనాలను తిరుపతి జంతు ప్రదర్శనశాలలోని నిపుణులకు పంపించారు. అది నిజంగా చిరుతపులేనా లేక మరేదైనా అడవి జంతువా అన్న కోణంలో పరిశీలనలు చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా గ్రామస్తులకు హెచ్చరికలు చేశారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. మరీ తప్పనిసరి అయితే, చేతిలో తప్పకుండా కర్రలు పట్టుకుంటేనే బయటకు రావాలని సూచించారు. పెంపుడు కుక్కలుంటే, వాటిని ఇంటి లోపల కాకుండా బయటే ఉంచాలని జాగ్రత్తలు చెప్పారు.