ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామంలోని తమ్మిలేరు వాగు వద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో అదే గ్రామానికి చెందిన యువకుడు గల్లంతయినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. వాగులో గల్లంతయిన వ్యక్తి నర్రా శ్రీ బాబుగా (17) తోటి విద్యార్థులు తెలిపారు. వీరంతా ఏలూరు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు.
గ్రామస్తులకు సమాచారం ఇచ్చిన తోటి విద్యార్థులు
ఉదయం 10 గంటలకు శ్రీ బాబు గల్లంతవ్వగా విద్యార్థులందరూ కలిసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు యువకుడి ఆచూకి కోసం వాగులో దూకి గాలించారు.దొరకపోవడంతో అధికారులకు సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీం యువకుడి గాలింపు చర్యల కోసం వాగులోకి దిగి గాలించారు. ఎట్టకేలకు నర్రా శ్రీ బాబు మృతదేహం ఓ గోతిలో ఉండడంతో బయటికి తీసిన సిబ్బంది బాలుడి స్వస్థలానికి తరలించారు. అదే తమ్మిలేరు వాగులో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఇసుక అక్రమ రవాణాదారులు ఎక్కడబడితే అక్కడ గోతులు తొవ్వుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
ఇసుక రవాణా కోసం తీసిన గోతిలో చిక్కిన యువకుడి డెడ్‌బాడీ
తమ్మినేని వాగులో ఇసుక అక్రమ రవాణా కోసం తీసిన గోతిలో యువకుడి మృతదేహం ఇరుక్కుపోయి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి ఆంబులెన్స్ వాహనంలో యువకుడి మృతదేహాన్ని తరలించారు. చేతికి అందిన కొడుకు వాగులో పడి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పొద్దున వరకు కళ్ళ ముందు తిరిగిన కొడుకు తమ కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. దీంతో గ్రామప్రజలు సైతం బాధపడుతున్నారు. గ్రామంలో చలాకిగా తిరిగే శ్రీ బాబు మృతి చెందడంతో తన సొంత గ్రామం అయినటువంటి వెంకటాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నవయసులో చేతికందిన కొడుకు చనువు చాలించడంతో కుటుంబసభ్యులు యువకుడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.