/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Capture-jpg.webp)
ఎన్నికల కమిషన్ తెలంగాణలో భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు (RTV UNCENSORED Interview) ఆయన హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్టీవీ ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులను మార్చినంత మాత్రాన ఎన్నికలు తారుమారు అయ్యే అవకాశం ఉండదన్నారు. మరో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014కి ముందు తెలంగాణ.. 2014 తర్వాత తెలంగాణ ఎలా ఉంది అన్న అంశం ట్రెండింగ్ లో ఉందన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా.. ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారన్నారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు.
కాంగ్రెస్, బీజేపీల పాలన ఎలా ఉందో కర్ణాటక, ఛత్తీస్ గడ్ కు వెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. కేసీఆర్ అంత విజన్ ఉన్న నాయకుడు కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారో చెప్పాలని ఆ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు క్రాంతి కిరణ్. మేనిఫెస్టోలో లేని అనేక హామీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందన్నది.. ప్రతిపక్షాలు చేస్తున్న ఓ కృత్రిమ ప్రచారం అని ఆయన అభివర్ణించారు. అత్యంత పారదర్శకంగా పథకాలు అమలు అవుతున్నాయన్నారు.
అర్హులు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి పథకాలు అందించామన్నారు. బాబూ మోహన్, దామోదర్ రాజనర్సింహ ఇద్దరిలో తనకు ప్రధాన ప్రత్యర్థి దామోదర్ రాజనర్సింహా అని అన్నారు. అందోలు నియోజకవర్గంలో తాను గెలిచిన నాటి నుంచి ఒక్కో గ్రామానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు మంజూరు చేశామన్నారు. తాను జర్నలిస్టుగా ఎంత నిజాయితీగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే నిజాయితీగా ఉన్నానన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు అన్నీ అవాస్తవమన్నారు.
ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది..