Kilari Venkata Rosaiah: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరి జనసేన కార్యాలయంలో కిలారి రోశయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
MLA టికెట్ ఇవ్వలేదని..
కిలారి రోశయ్య 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పొన్నురు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ కీలక నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రను ఆ ఎన్నికల్లో ఓడించి రికార్డు సృష్టించారు రోశయ్య. అయితే.. 2024 ఎన్నికల్లో ఆయనకు మరోసారి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ఆయనను ఎంపీగా బరిలోకి దించారు జగన్. అయితే.. ఎంపీగా ఆయన ఓటమి పాలయ్యారు.
అయితే.. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వకుండా ఎంపీగా పోటీకి దించిన నాటి నుంచే రోశయ్య పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
మాజీ మంత్రితో సహా...
మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. వరుసగా నేతలు రాజీనామా చేస్తున్నారు. కాగా ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ జనసేనలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే విరిబాటలోనే మరో నేత వైసీపీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
ఎన్నికలు అయ్యాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అన్ని సెట్ అయితే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమని ఆయన అనుచరుల్లో మాట వినిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సిఎం జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. 2019 లో సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు సరైన పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే వైసీపీ అధిష్టానంపై శ్రీనివాస్ అలిగారు.