Jagan: కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకున్న ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాగా ఈరోజు పులివెందులలో ఆయన పర్యటించనున్నారు. కాసేపట్లో బంధువుల ఇంటికి వెళ్లనున్నారు. బంధువులను కలిసి వారితో చర్చలు జరపనున్నారు. బంధువుల పెళ్లి, శుభాకార్యాల్లో పాల్గొంటారు. ఆస్తుల వివాదం నేపథ్యంలో ఆసక్తికరంగా బంధువుల కలయిక మారింది. ఆస్తుల విషయంపై వరుసగా జగన్‌పై షర్మిల, విజయమ్మ బహిరంగ లేఖలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ కు విజయమ్మ షాక్...
జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదంపై వై.ఎస్.సతీమణి విజయమ్మ నిన్న స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు తనను చాలా చాలా బాధిస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో తనకు అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయన్నారు.
రెచ్చగొట్టకండి ప్లిజ్..
తన ఫ్యామిలీ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. అబద్దాల పరంపర కొనసాగుతుందని.. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని అన్నారు. అందువల్ల ఇతరులు తమ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దని విజయమ్మ కోరారు. అన్న, చెల్లి ఇద్దరు అంగీకారానికి వస్తారని.. వాళ్లను రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మండిపడ్డారు.
వారికి అన్ని తెలుసు...
వై.ఎస్ ఉండగా ఆస్తుల పంపకం జరగలేదన్నారు. వాళ్లిద్దరూ పిల్లలుగా ఉన్న రోజుల్లో కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద, మరికొన్ని షర్మిల పేరు మీద రాశారని తెలిపారు. విజయసాయి, సుబ్బారెడ్డికి అన్నీ తెలుసన్నారు. ఒక అమ్మగా తనకు ఇద్దరు సమానమేనని పేర్కొన్నారు. ఆస్తుల్లో భాగం కూడా ఇద్దరికి సమానమేనని ఆ లేఖలో రాసుకొచ్చారు. అంతేకాకుండా నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు ఆస్తి సమానంగా ఉండాలనేది వైఎస్ కోరిక అని విజయమ్మ అన్నారు. ఆస్తులను పెంచడంలో జగన్ కష్టం ఉందని.. కానీ అవన్ని కుటుంబ ఆస్తులేనని చెప్పుకొచ్చారు. జగన్ గెలిచిన రెండు నెలలకు ఆస్తులు పంచుకుందామని నిర్ణయించారని అన్నారు.