Vnade Metro: రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతునే ఉంది. ఈ క్రమంలో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. తాజాగా వందే మెట్రో పేరుతో తక్కువ దూరం ఉండే నగరాల మధ్యన నడిపేలా కొత్త రైలును కూడా ప్రవేశపెట్టారు. గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్యన దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు.
ఏపీలోనూ వందే మెట్రో పరుగులు తీయనుంది. ఈ విషయమై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డీఆర్ఎమ్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యి అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే రోజువారీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం- విశాఖపట్నం మార్గంలో వందే మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే అధికారులను మంత్రి కోరిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం నుంచి విశాఖకు వివిధ పనుల కోసం రోజువారీ ప్రయాణాలు చేసే వారు ఎక్కువ మంది ఉంటారని.. వారిని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం- విశాఖ నమో భారత్ రైలును నడపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతికి కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఇక రైల్వేలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణీకులకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.