Anil Kumar Singhal : టీటీడీ ఈవో 'డైరెక్షన్'లోనే కల్తీనెయ్యి స్కామ్ ?

తిరుమల పవిత్రతను మంటగలుపుతూ ఐదేళ్ల పాటు సాగిన కల్తీనెయ్యి కుంభకోణంలో అసలు 'సూత్రధారి' ఎవరనే దానిపై సిట్ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ సంచలనం రేపుతోంది. ఈ భారీ స్కామ్‌కు అప్పటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాలే 'కింగ్ పిన్' అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
FotoJet (88)

Anil Kumar Singhal

TTD EO : తిరుమల పవిత్రతను మంటగలుపుతూ ఐదేళ్ల పాటు సాగిన కల్తీ నెయ్యి కుంభకోణంలో అసలు 'సూత్రధారి' ఎవరనే దానిపై సిట్ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ సంచలనం రేపుతోంది. అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీలోకి ప్రవేశపెట్టి, తద్వారా 20 కోట్ల లడ్డూలను అపవిత్రం చేసిన ఈ భారీ స్కామ్‌కు అప్పటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాలే 'కింగ్ పిన్' అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 250 కోట్ల రూపాయల మేర జరిగిన ఈ కుంభకోణంలో నాటి టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కూడా తెలియకుండా ఈఓ నేరుగా చక్రం తిప్పారని టీటీడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఆయన పేరు మాత్రం బటయకు రాకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి సిట్ రిపోర్టు నుంచి ఎస్కేప్ అయినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో సుమారు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల కొండపైకి చేరవేశారు. దీని ద్వారా తయారైన 20 కోట్ల లడ్డూలు భక్తులు ఆరగించారు.  కల్తీ నెయ్యిని వాడినా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు అత్యంత తెలివిగా వ్యవహరించారు. నెయ్యిలా సహజమైన సువాసన వచ్చేట్టు ప్రమాదకరమైన కెమికల్స్‌ను అందులో మిక్స్ చేశారు. ఈ రసాయన సమ్మేళనం వల్ల ల్యాబ్ టెస్టుల్లో కూడా వెంటనే ఇతర నూనెల ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆవు నెయ్యికి బదులుగా పామాయిల్, పామ్ కెర్నెల్, పామాలిన్ ఆయిల్ వంటి చౌకబారు నూనెలను కలిపినట్లు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, కోట్ల మంది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడిగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ మొత్తం వ్యవహారం టీటీడీ అప్పటి, ప్రస్తుత ఈఓ సింఘాల్‌ డైరెక్షన్‌లోనే జరిగిందన్న చర్చ జరుగుతోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో భోలేబాబా డెయిరీ, దాని అనుబంధ సంస్థలైన హర్షా ట్రేడింగ్, హర్షా ఫ్రెష్ కంపెనీలతో నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ రహస్యంగా డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడం వెనుక భారీ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలున్నాయి. టీటీడీ చైర్మన్ దృష్టికి రాకుండానే నెయ్యి కొనుగోలు వ్యవహారాలను ఈఓ సింఘాల్ స్వయంగా పర్యవేక్షించారని, కీలక ఫైళ్లపై ఆయనే సంతకాలు చేశారని టీటీడీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఈ క్రమంలోనే నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ సమర్పించిన 219 పేజీల తుది ఛార్జ్‌షీట్‌లో నెయ్యి కల్తీ గురించి వివరించారు. ఈ స్కామ్‌లో ఏ ఏ కంపెనీలు పాల్గొన్నాయి, ఏ అధికారుల కనుసన్నల్లో ఈ నెయ్యి డీలింగ్ జరిగింది అనే అంశాలను అధికారులు వివరించారు. ఈ నివేదిక ఇప్పుడు అటు అధికారిక వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే సిట్ రిపోర్ట్ లో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పేరు రాకపోవటంపై టీటీడీ వర్గాల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ స్కామ్ బయటపడిన తర్వాత తన పేరు ఎక్కడా లీక్ కాకుండా సింఘాల్ ఢిల్లీ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించినట్లు ప్రచారం జరుగుతున్నది. సిట్ రిపోర్టులో తన పేరును మాయం చేసేందుకు, కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ఆయన అత్యున్నత స్థాయిలో చక్రం తిప్పారని, అందుకే ఆయన చేసిన స్కామ్ వ్యవహారం వెలుగులోకి రాలేదని, సిట్ రిపోర్టులో ఆయన పేరు మాయం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను కాపాడుతున్న ఢిల్లీ పెద్దలెవరనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు