/rtv/media/media_files/2025/11/01/kashibugga-stampede-2025-11-01-15-04-32.jpg)
Kashibugga Stampede
Kashibugga Stampede: కార్తీక మాసం తొలి ఏకాదశి నాడు గోవిందా నామస్మరణలతో మారుమోగాల్సిన ఆలయం భక్తుల ఆర్తనాదాలతో హోరెత్తింది! ఈరోజు శ్రీకాకుళం పలాస జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఏకాదశినాడు సంతోషంగా స్వామి దర్శనానికి వెళ్లిన ఆ భక్తులకు ఇదే చివరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు! తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ అధీనంలో లేదని.. అది పూర్తిగా ప్రైవేట్ ఆలయమని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఓ భక్తుడి బాధ నుంచి..
12 ఎకరాల్లో తిరుమల ప్రతిరూపంగా నిర్మించిన ఈ ఆలయం ఓ భక్తుడి బాధ నుంచి పుట్టింది. అతనికి వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి.. కానీ, ఒకరోజు దర్శనం కోసం తిరుమలకు వెళ్లగా రద్దీలో ఆ స్వామి కృప దక్కలేదు. కనులారా స్వామి దర్శనం కాలేదు. దీంతో ఆ భక్తుడి మనసు చివ్వుక్కుమంది! ఆ బాధలో నుంచి పుట్టిన ఆలోచనే ఈ పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి మూలం.
పలాసకు చెందిన హరి ముకుంద పండా అనే వ్యక్తి పదేళ్ల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అయితే దర్శనం చేసుకునే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ముందుకు తోసేశారు. దీంతో హరిముకుంద చాలా బాదపడ్డారట. స్వామివారిని కనులారా చూడలేకపోయానని తీవ్ర ఆవేదన చెందారట. సాధారణంగా ఇలా ఎవరికైనా జరిగితే.. ఇంకోసారి వచ్చినప్పుడు కనులారా శ్రీవారిని దర్శించుకుందాములే అని సరిపెట్టుకుంటారు. కానీ.. హరి ముకుంద పండా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం!
ఆ రోజు తిరుమలలో దర్శనం కాలేదని.. ఏకంగా తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే తిరుమలను పోలిన ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న 100 ఎకరాల్లో 12 ఎకరాల స్థలాన్ని స్వామివారి ఆలయానికి కేటాయించారు. అందరికీ దైవ దర్శనం కావాలనే సంకల్పంతో.. తన సొంత డబ్బుతో తిరుమల ఆనంద నిలయాన్ని పోలిన విధంగా ఆలయాన్ని నిర్మించారు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహాలను ప్రతిష్టించారు. అదే ఈరోజు శ్రీకాకుళం పలాసలో వెలసిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం! అచ్చం తిరుమలలో ఉన్న మాదిరిగానే 12 అడుగుల వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కూడా ప్రతిష్టించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/01/kasibugga-temple-2025-11-01-15-06-23.jpg)
సొంతం డబ్బుతో
హరి ముకుంద పండా ఎవరి దగ్గర నుంచి రూపాయి కూడా ఆశించకుండా.. తన సొంతం డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. పదేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం మొదలవగా.. దాదాపు ఏడాది క్రితం నుంచి ఆలయంలో స్వామివారికి పూజలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఈ ఆలయానికి భక్తుల రాక మొదలైంది. ఈరోజు తొలి ఏకాదశి, కొత్త కట్టిన ఆలయం కావడంతో వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రద్దీ పెరగడంతో ఆలయంలోని క్యూలైన్ల వద్ద ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. దీనివల్ల వెనుక ఉన్న జనం వారిపై పడటంతో తొక్కిసలాట జరిగింది.
Also Read: PM Modi: కాశీబుగ్గ తొక్కిసలాటపై స్పందించిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Follow Us