Republic Day 2026: అమరావతిలో తొలిసారి ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. రాయపూడి వద్ద పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. 13 వేల మందికి సీటింగ్, భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు.

New Update
Republic Day 2026

Republic Day 2026

Republic Day 2026: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం నమోదు కానుంది. తొలిసారిగా రాష్ట్రస్థాయి రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు ఈ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగేవి. అయితే ఈసారి రాజధాని అమరావతి వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.

సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలోని రాయపూడి ప్రాంతంలో కొత్తగా పరేడ్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేశారు. ప్రధాన వేదిక, పరేడ్ ట్రాక్, గ్యాలరీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫైనల్ రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు.

ఈ వేడుకలకు హాజరయ్యే ప్రజలు, వీఐపీ, వీవీఐపీల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ వాహనాల పార్కింగ్‌కు 15 ఎకరాలు, ప్రజల వాహనాల కోసం మరో 25 ఎకరాలు కేటాయించారు. మొత్తం 13 వేల మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు స్పష్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక గౌరవం ఇచ్చింది. వారి కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. రైతులు వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలు కూడా పంపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని గుర్తు చేసుకునేలా ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ శాఖల అభివృద్ధిని చూపించే శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పరేడ్‌ను పరిశీలించనున్నారు.

భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

రాజధానిగా ప్రకటించి ఎన్నేళ్లైనా అమరావతిలో ఇలాంటి భారీ అధికారిక వేడుక జరగడం ఇదే తొలిసారి. అందుకే ఈ రిపబ్లిక్ డే వేడుకలు అమరావతి భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన సూచనగా భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు