Ration Cards: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు గడుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ చంద్రబాబు సర్కార్ ముందుకు వెళ్తోంది. అయితే తాజాగా నూతన రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నూతన డిజైన్‌లతో రూపొందించిన రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
బాధ్యతగా పనిచేయండి..
నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని తెనాలిలో నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల సిబ్బంది పనితీరుపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజాప్రతినిధుల చొరవ, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెనాలి మండలంలో రోజుల వ్యవధిలో 5,808 మంది రైతుల అడంగల్ పొరపాట్లను సరిదిద్దిన తీరు చాటిచెబుతుందని అన్నారు.
సిద్ధంగా ఉండండి..
రాష్ట్రంలో ప్రభుత్వం ఆదేశాలు మేరకు పెన్షన్ల ఆడిటింగ్‌కు అంతా సిద్ధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి చెప్పారు. అర్హత ఉన్న వారికి పెన్షన్ అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశం పెట్టిన దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్ల పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని హర్ష వ్యక్తం చేశారు. కాగా ఈ పథకం అమలును పరిశీలిస్తే రాష్ట్రంలో 12 లక్షల నుంచి 16 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఆధార్ అనుసంధానం కాలేదని చెప్పారు. అనుసంధానం (ఈకేవైసీ) చేయించుకునే అవకాశాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోనే త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.