Pawan Kalyan: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి...స్పందించిన పవన్‌ కల్యాణ్‌!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం పై తాజాగా స్పందించారు. ఈ విషయం తెలియగానే తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు.

New Update
ap dept cm

Pawan Kalyan: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ క్రమంలో ఎక్స్‌ ఖాతాలో ఓ సంస్థ ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తూ చేసిన పోస్టుకు ఆయన స్పందించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం గురించి తెలిసి తీవ్ర కలత చెందినట్లు ఆయన పేర్కొన్నారు. 

 బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వివరించారు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్‌ ఈ సందర్భంగా  కోరారు. ఆలయాల రక్షణపై మతాధిపతులు, న్యాయనిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో చర్చ జరిపి దీని గురించి తీవ్రంగా చర్చిస్తామన్నారు. ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరమని ఈ సందర్భంగా పవన్‌ అన్నారు. 

సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పవన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలనూ దెబ్బతీసిందని పవన్ అన్నారు.

వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ హయాంలో టీటీడీ మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (ఫారిన్‌ ఫ్యాట్స్‌) కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైందని వివరించింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ ఉపయోగించారని తెలిపారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని ప్రసాదాలకు వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు