CM Chandrababu: ఎన్డీయే కూటమిలో భాగమైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు హర్యానాకు వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొంటారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఏపీలో పసుపు జెండా ఎగురవేశారు. మరోవైపు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర అభివృద్ధి కొరకు వరుస ఢిల్లీ పర్యటనలు చేపట్టారు. ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు.
నేడే ప్రమాణస్వీకారం...
ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ వికసించింది. మూడోసారి హర్యానా అధికార పీఠాన్ని దక్కించుకుంది. కాగా సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలనే దానిపై జారుతున్న చర్చకు బీజేపీ అగ్రన్యాయకత్వం తెర దింపింది. హర్యానా సీఎం అభ్యర్థిగా నాయబ్ సింగ్ సైనీ పేరును ఫైనల్ చేసింది. కాగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నాయకులు అనిల్ విజ్ కూడా నాయబ్ సింగ్ సైనీ పేరును ప్రతిపాదించారు. దీంతో సభ్యులందరూ కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ కు సర్వేలా దెబ్బ...
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్ని పోల్ సర్వేలు అంచనా వేశాయి. కానీ వాటి అంచనాలన్నీ తప్పడంతో హస్తం నేతలు షాకైపోయారు. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇలా వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ 37 సీట్లలోనే గెలిచి మరోసారి ఓటమిని మూటగట్టుకుంది.