YCP MLA's: ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి వరుస షాకులు వెంటాడుతున్నాయి. జగన్ కు నేతల ఫిరాయింపులు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా మరికొంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారి బాటలోనే నడిచేందుకు పలువురు కీలక నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో జగన్‌పై అసంతృప్తిగా ఉన్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అయితే వైసీపీ వారిని చేర్చుకునేందుకు టీడీపీ సుముఖంగా లేకపోవడంతో ఆ పార్టీ వారంతా జనసైన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేనలో చేరిన బాలినేనితో పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పలువురు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు కూడా చర్చ జరుగుతోంది.
పెరుగుతున్న పవన్ బలగం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నేతలకు నమ్మకం ఏర్పడింది. గతంలో మాదిరిగా ఆయన లీడర్లలో విశ్వాసాన్ని పొందుతున్నారు. అందుకే భారీ స్థాయిలో చేరికలు ఉంటున్నాయి. భవిష్యత్ అంతా జనసేనదేనని నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుదల ఖాయమని నేతలు భావిస్తున్నారు. అంతే కాకుండా పవన్ చరిష్మాతో పాటు అభిమానుల లక్షల సంఖ్యలో ఉండటం, మెగా కుటుంబం అండదండలతో పాటు ప్రధానంగా బలమైన కాపు సామాజికవర్గం మద్దతు లభించి తాము ఖచ్చితంగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారట.
ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేస్తే చాలు గెలుపు పక్క అనే ధీమా నేతల్లో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి జనసేన అభ్యర్థులను విజయం సాధించారు. అంటే 100 శాతం స్ట్రయిక్ రేట్ పవన్ పార్టీ సాధించింది. టీడీపీ తరువాత జనసేన బలమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని విశ్విసిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతమున్న ప్రభుత్వంపై అసంతృప్తి నేరుగా పవన్ కల్యాణ్ పై ప్రభావం చూపే అవకాశం కూడా లేదు. చంద్రబాబు నాయుడు, టీడీపీలపైనే చూపనుందని, అందుకే టీడీపీపై ప్రజలు విసుగు చెందినా జనసేన వైపు మొగ్గు చూపుతారన్న ఆశతో నేతలు వరస బెట్టి గాజుగ్లాస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నది అందరూ అంగీకరించాల్సిందే.