APMDC మాజీ MD వెంకట రెడ్డి అరెస్ట్
ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి ని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు లోఆయనను హాజరు పరిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే వెంకట రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
వెంకట రెడ్డి చర్యలు వల్ల ప్రభుత్వానికి 2 వేల 566 కోట్ల రూపాయలు మేర ఆదాయానికి గండి పండిందని అధికారులు పేర్కొన్నారు. వెంకట రెడ్డి లొంగి పోయారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. కాగా అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా.. అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వెంకట రెడ్డిని శుక్రవారం వేకువజామున విజయవాడకు తీసుకొచ్చారు.
శుక్రవారం మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహించారు.
గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఇసుక తవ్వకాల్లో భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా వెంకట రెడ్డి అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు. దీంతో ఆయనపై ఈ నెల 11న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ అధికారులు ఎట్టకేలకు హైదరాబాద్ లో ఆయనని పట్టుకున్నారు.
ఇక వెంకట రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ. వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన కుట్రలకు పాల్పడ్డారని ఏసీబీ వివరించింది.