విశాఖ డెయిరీపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు!

విశాఖ డెయిరీ స్వలాభం కోసం రైతులకు నష్టం చేస్తోందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డెయిరీ పూర్తిగా వాణిజ్య రంగం వైపు మళ్లిపోయి రైతుల సంక్షేమాన్ని పక్కన బెట్టిందన్నారు. ఈ అంశంపై అన్నీ పార్టీల నాయకులు పోరాడాలని పిలుపునిచ్చారు.

New Update
Ayyanna Pathrudu

విశాఖ డెయిరీ రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. నర్సీపట్నంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో అప్పటి పెద్దలు విశాఖ డెయిరీని స్థాపించారన్నారు. అయితే, ఇప్పుడు ఆ డెయిరీ పూర్తిగా వాణిజ్య రంగం వైపు మళ్లిపోయి రైతుల సంక్షేమాన్ని పక్కన బెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

లక్షల మంది రైతులకు అన్యాయం..

డెయిరీ తమ స్వలాభం కోసం ఆవు పాలు లీటరుకు 3 రూపాయలు తగ్గించినందుకు రైతులు తీవ్రంగా ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల సుమారు మూడు లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు లక్షల రూపాయలు నష్టపోతారని వివరించారు. ఈ నిర్ణయం రైతులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ఈ అంశంపై స్పందించాలని రైతు సంఘాలను ఆయన కోరారు. విశాఖపట్నంలోని విలువైన 7.95 ఎకరాల భూమిని డెయిరీ ఆక్రమించిందని జనసేన నాయకుడు, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని అయ్యన్న వెల్లడించారు. 

దీనిపై కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోవాలన్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టి, రైతుల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు సైతం స్పందించి విశాఖ డెయిరీపై విచారణ చేపట్టాలన్నారు. ఈ ఆరోపణలు వాస్తవం అని తేలితే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని పార్టీల నాయకులు కలిసి రైతుల ఈ సమస్యపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు