Nara Lokesh: ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. నిన్న ఆయన టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఈ భేటీ అద్భుతంగా జరిగిందని.. ఈరోజు 'BIG ANNOUNCEMENT' ఉండబోతుందని.. చంద్రశేఖరన్‌తో కలిసి ఉన్న ఫోటోను జోడించి.. అందరు వెయిట్ చేయండి అంటూ తన అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా లోకేష్ చేసిన ట్వీట్ పై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఏంటి ఆ భారీ ప్రకటన అనే చర్చ జోరందుకుంది.
ఇది రెండోసారి...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టాటా గ్రూప్స్ తో మంత్రి లోకేష్ భేటీ కావడం ఇది రెండోసారి. ఆగస్టు 16న సీఎం చంద్రబాబును చంద్రశేఖరన్ కలిశారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వారి భేటీ జరిగినట్లు గతంలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏపీలో త్వరలో టాటా గ్రూప్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని.. చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రత్యేక్షంగా కానీ.. పరోక్షంగా కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కాగా సీఎం చంద్రబాబు సచివాలయానికి వచ్చిన చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేష్ కూడా సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు పెట్టేందుకు తమ ప్రభుత్వ ఆహ్వానిస్తుందని అన్నారు.
20 లక్షల ఉద్యోగాలు..
ఏపీలో రాబోయే ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. ఏపీలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనేది తమ ఎజెండా అని అన్నారు. దీనికి సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్ ఎనర్జీ, టెలీకమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నాయని.. పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు.