/rtv/media/media_files/2025/09/08/ys-jagan-ys-raja-reddy-2025-09-08-12-40-24.jpg)
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలా రెడ్డి కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని ఆయన బయలుదేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజారెడ్డి ఇప్పటి నుంచి పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.
వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత చదువులు చదివారు. గతేదాడి అట్లూరి ప్రియను ఆయన వివాహం చేసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మకు రాజారెడ్డి అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వద్దే అమెరికాలో ఉన్నారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరిన సమయంలో ఇక్కడ ఉండడం సరికాదని భావించిన విజయమ్మ మనవడి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి కూడా రాజారెడ్డి అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. అందుకే ఆయన తండ్రి రాజారెడ్డి పేరును షర్మిల కొడుక్కి ఆయన పెట్టుకున్నారని తెలుస్తోంది.
వైఎస్ షర్మిలా కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇవాళ ఆయన తన తల్లితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌కి వెళ్లారు. ఇంట్లో అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని తల్లితో కలిసి బయలుదేరాడు. త్వరలోనే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం… pic.twitter.com/E8yttonzNW
— Kaza RajKumar (@KazaRajKumar) September 8, 2025
తనతో పాటు కొడుకుని కూడా రాజకీయాల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్న షర్మిల తాజాగా రాజారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉండడంతో ఇదే ఆయన రాజకీయ ప్రవేశానికి సరైన సమయమని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచి పర్యటనలు ప్రారంభిస్తే ఎన్నికల నాటికి ఆయన రాటు దేలే అవకాశం ఉంటుందన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి రాజారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశం ఉంది. ఇది జగన్ కు ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన షర్మిల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది హైకమాండ్. గత ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగి జగన్ కు సవాల్ గా మారారు. అయితే.. ఆ ఎన్నికల్లో షర్మిల పెద్దగా ప్రభావం చూపక పోయినా.. జగన్ ఓటమికి మాత్రం కారణమయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి. విజయమ్మ సైతం షర్మిలకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరాడం ఆ సమయంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆమె కుమారుడు రాజారెడ్డి సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.