పీఏసీ చైర్మన్ పదవికి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గడువు ముగిసే నాటికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా పీఏసీ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. పది శాతం అంటే కనీసం 18 సీట్లు లేకపోవడమే ఇందకు కారణమని స్పీకర్ చెబుతున్నారు. ఈ విషయంపై జగన్ కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి కూడా దక్కదన్న ప్రచారం సాగింది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఈ పదవికి అభ్యర్థిని పోటీ కూడా ఉంచకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
నామినేషన్ల గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన నామినేషన్ వేయడానికి అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఆ సమయంలో అధికారులు కూడా ఎవరూ లేరు. దీంతో బొత్స అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఎట్టకేలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడువులోగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
కేబినెట్ ర్యాంక్ పదవి..
పీఏసీ చైర్మన్ కు కేబినెట్ ర్యాంక్ ఉంటుంది. దీంతో పెద్దిరెడ్డి ఈ పదవికి ఎన్నికైతే ఆయనకు కేబినెట్ ర్యాంక్ లభించనుంది. అయితే.. 21 సీట్లు సాధించి అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేనకు ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. ఆఖరి నిమిషంలో ప్రభుత్వం ఈ అంశంపై ఎందుకు వెనక్కు తగ్గిందోనన్న చర్చ సాగుతోంది. అయితే.. జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉంది. దీంతో ఆనవాయితీగా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే ఈ పదవిని జనసేనకు ఇవ్వడం సరికాదన్న నిర్ణయానికి కూటమి పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ పదవి కోసం పోటీకి అభ్యర్థిని పెట్టలేదని తెలుస్తోంది.
చంద్రబాబుకు బద్దశత్రువు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు బద్దశత్రువుగా చెబుతుంటారు. చంద్రబాబుపై అనేక సార్లు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు పుడింగి అంటూ చంద్రబాబు కూడా పెద్దిరెడ్డిని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే తన లక్ష్యమంటూ కుప్పంపై పెద్దిరెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. కానీ ఆయన లక్ష్యం నెరవేరలేదు.