West Godavari: ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడి కుటుంబంపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో చోటుచేసుకుంది. సహాయం చేసినందుకు యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపేటకు చెందిన ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అనంతరం యువకుడి బంధువైన మైసన్నగూడేనికి చెందిన రాజు అనే వ్యక్తి వారికి ఆశ్రయం కల్పించాడు. దీంతో అతడిపై కోపంతో యువతి తరపు బంధువులు నిన్న రాజు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు.
Also Read: నేను ఆ తప్పు చేయలేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: జనసేన ఇంచార్జ్
ఈ క్రమంలో యువతి బంధువులు తప్పించుకునే ప్రయత్నం చేసిన రాజుపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసే యత్నం చేయగా స్థానికులు కల్పించుకుని వారిని అడ్డుకున్నారు. అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర తోపాటు మరో 50 మందికి పైగా తనపై దాడి చేసినట్టు బాధితుడు రాజు ఆరోపించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తల్లి కనకదుర్గ, మేనత్త శశిరేఖపైనా నిందితులు దాడి చేసినట్టు రాజు పేర్కొన్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.