/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Budameru-floods-.jpg)
విజయవాడ వరదలకు గల కారణాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాల వల్లే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. వీటన్నింటిపై త్వరలో సర్వే జరిపిస్తున్నామని ప్రకటించారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనులను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేష్ ను చంద్రబాబునాయుడు ఆదేశించారు.
కుడి ఎడమ ప్రాంతాల్లోని భారీ గండ్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు చర్యలు చేపట్టిందన్నారు. విజయవాడలోని వరద ప్రాంతాల ప్రజలకు ఇప్పటి వరకూ ఆహారం, మంచినీరు సరఫరా చేశామన్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే కార్యక్రమం షెడ్యూల్ ను నేటి సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. వరద కారణంగా దెబ్బతిన్న మోటారు వాహనాలకు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా సర్టిఫికెట్టు ఇస్తామన్నారు.
ఇన్స్యూరెన్స్ కంపెనీలతో కూడా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతి ఒక్కరూ శక్తి మేరకు సాయం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.