ఎన్నికల ముందు వరకు కొడాలి నాని ఆధిపత్యం కొనసాగిన గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఇన్నాళ్లు కొడాలి నాని ఆధీనంలో ఉన్న శరత్ థియేటర్‌ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. థియేటర్‌లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫొటోలను తొలగించారు. ఇన్నాళ్లు శరత్ థియేటర్‌లోనే వైసీపీ ఆఫీస్ కొనసాగింది. ఈ థియేటర్ కేంద్రంగా కొడాలి నాని మీటింగ్‌లు నిర్వహించేవారు. ఈ శరత్ థియేటర్‌ను నాని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే యాజమాన్యం అలర్ట్ అయ్యింది. టీడీపీ నేతల సహకారంతో శరత్ టాకీస్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే.. ఈ శరత్ టాకీస్‌లో టీ-పార్టీకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరు కావడం గుడివాడలో హాట్ టాపిక్ గా మారింది. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఈ టీ-పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు తనను కలిశారన్నారు. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్ల అరాచకానికి అడ్డాగా వైకాపా కార్యాలయం నిలిచిందని ఆరోపించారు. ఇక్కడకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ఆఖరికి ముగ్గురు హక్కుదారులు థియేటర్ కు వస్తే కూడా వారు బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు.
గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. వారందరికీ కూడా న్యాయం చేస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని హక్కు దారులకు అప్పగించామన్నారు. గుడివాడలో అరాచకాలు రూపుమాపి ప్రజల ఊరుగా మారుస్తానన్నారు.