Pawan Kalyan Political Journey: 'అసెంబ్లీలో అడుగు పెడతా.. జగన్ తాట తీస్తా..' సరిగ్గా రెండేళ్ల క్రితం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్ ఇది. అటు పవన్ అసెంబ్లీలో ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ వైసీపీ కూడా సవాల్ చేసింది. సీన్ కట్ చేస్తే.. పవన్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) గడ్డపై జనసేన జెండా రెపరెపాలాడుతోంది. బలమైన అభ్యర్థి వంగా గీతా(Vanga Geeta)ను పవన్ ఓడించడం ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా చేసింది. అయితే పవన్‌కు ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు.. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ ఎన్నో అటుపోట్లను, ఘోర అవమానాలను ఎదుర్కొన్నారు.. అయితే వాటిని అధిగమించి పవన్ ఎలా విజయం సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం!
ట్రోలింగ్‌కు గురైన పవన్:
2014లో పార్టీ స్థాపించినా ఆ ఎన్నికల్లో పోటి చేయలేదు జనసేన. 2019లో తొలిసారి కమ్యూనిస్టులతో కలిసి పవన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనే స్వయంగా రెండు చోట్ల పోటి చేశారు. అయితే అటు గాజువాక, ఇటు భీమవరం రెండు చోట్లా ఓటమిని చవిచూశారు. ఇక జనసేన పార్టీ కూడా 175 ఏపీ అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. దీంతో పవన్‌పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అటు వైసీపీనే కాదు ఇటు టీడీపీ కార్యకర్తలు సైతం పవన్‌ను గేలీ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఈ అవమానాలకు పవన్ కుంగిపోలేదు.. పడిన చోటే లేచి నిలబడాలనుకున్నాడు.. 2019-2024వరకు తెలివిగా అడుగులు వేశారు.. చివరికి అనుకున్న సక్సెస్ సాధించారు.
డిప్యూటీ సీఎం ఫిక్స్?
2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. తన సొంత కులం కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. అయితే పవన్‌ను ఎలాగైనా ఓడించాలని భావించిన వైసీపీ కూడా తెలివిగా పావులు కదిపింది. రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్నా అసలు ఎక్కడా వివాదాల జోలికి పోని వంగా గీతను పవన్‌పై నిలబెట్టింది. గీతాను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని స్వయానా జగన్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటు పవన్ గెలిచి.. కూటమి కూడా అధికారంలోకి వస్తే జనసేననికి డిప్యూటీ సీఎం ఇస్తారన్నా ప్రచారం జరిగింది. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరకు పవనే పైచేయి సాధించారు.
సొంత టాలెంట్‌తో స్టార్‌డమ్
1971 సెప్టెంబర్ 2న పవన్ బాపట్లలో పుట్టారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. 1996లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు. అన్నయ్య చిరంజీవి సపోర్ట్‌తోనే పవన్ సినీ అరంగ్రేటం జరిగినా పవర్‌స్టార్ కష్టం మాత్రం ఎవరికీ తీసిపోనిది. తొలి సినిమాలో ఓ సీన్ కోసం చేతులపై కారు టైర్లు ఎక్కించుకున్నారు పవన్. తన సొంత టాలెంట్‌తో తక్కువ సమయంలోనే యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు.. పవన్ స్టార్‌గా టాలీవుడ్ సినీ లవర్స్ మనసును దోచుకున్నారు.
అన్నయ్యను వ్యతిరేకించిన పవన్:
2008-2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ చేసిన ప్రచారం ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆయన ఆవేశపూరీత ప్రసంగాలు జనాల్లోకి దూసుకెళ్లాయి. నాటి సీఎం, ప్రతిపక్ష నాయకులపై పదునైన మాటలతో పవన్ ఎన్నో ప్రసంగాలు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం 18 అసెంబ్లీ స్థానాలకే పరిమిమైంది. 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అన్నయ్య తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్.. 2014లో సొంతంగా జనసేన పార్టీతో ప్రజల ముందుకొచ్చారు.
పాచిపోయిన లడ్డూలంటూ ధ్వజం:
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమీకి అండగా నిలిచిన పవన్ వారి విజయంలో కీలక పాత్ర పోషించారు. 2016లో స్పెషల్ స్టెటస్ విషయంలో బీజేపీతో విభేదించిన పవన్ టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. స్పెషల్ స్టెటస్‌కు బదులుగా స్పెషల్ ప్యాకేజీని బీజేపీ ఇవ్వడాన్ని తప్పుబట్టిన పవన్ నాడు ఈ నిర్ణయాన్ని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. 2019లో కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగిన జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క సీటే గెలుచుకుంది.
చంద్రబాబుకు అండ:
2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లకు పవన్ మళ్లీ బీజేపీతో జత కట్టారు. ఇక 2023లో చంద్రబాబు పార్టీకి సపోర్ట్‌గా నిలిచారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రాజమండ్రీ సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబును కలిసిన పవన్ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా మరోసారి 2014లో లాగా ఏపీలో త్రి కూటమి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు టీడీపీ అటు బీజేపీ మధ్య వారధిగా నిలిచారు పవన్.
ఇంతకీ లెఫ్టా? రైటా?
అటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న పవన్‌పై పలు విమర్శలు కూడా ఉన్నాయి. పవన్ ఐడియాలజీ ఏంటన్నదానిపై చాలా సార్లు సందేహాలు వ్యక్తం చేశారు విశ్లేషకులు. 2014లో భగత్‌సింగ్ సిద్ధాంతాలతో పార్టీ పెట్టినట్టు ప్రకటించిన పవన్ అదే ఏడాది హిందూత్వ భావజాలమున్న బీజేపీకి మద్దతిచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల పక్షాన చేరారు. ఇక ఆ వెంటనే రైట్ పార్టీ అయిన బీజేపీకి మళ్లీ సపోర్ట్ ఇచ్చారు. ఇలా పదేళ్లలో రెండు భిన్న భావాలగల పార్టీలతో పవన్ జతకట్టడం విమర్శలకు కారణమైంది.
Also Read: గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్.. ఏకంగా నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు..!