World cup: ప్లేయర్లది కాదు.. బోర్డుదే తప్పు..! జీతాలు ఇవ్వకుండా ఆడమంటే ఎలా..?

వరల్డ్ కప్ 2023 టోర్నీలో వెస్టిండీస్ పోరాటం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లోనే ముగియటం పట్ల విమర్శలు పెరిగిపోతున్నాయి. పసికూన జట్టైన స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి విండీస్‌ ఇంటిముఖం పట్టింది. ప్రస్తుత వెస్టిండీస్‌ ప్లేయర్లు మాజీ ఆటగాళ్లను తలదించుకునేలా చేశారన్న విమర్శలు ఓవైపు నుంచి వస్తుండగా..అసలు తప్పు ప్లేయర్లది కాదు బోర్డుదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. జీతాల విషయంలో బోర్డు వైఖరి మారనందుకే విండీస్‌ క్రికెట్‌ ఎక్కువగా క్లబ్‌ క్రికెట్‌వైపు ఫోకస్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు.

New Update
World cup: ప్లేయర్లది కాదు.. బోర్డుదే తప్పు..! జీతాలు ఇవ్వకుండా ఆడమంటే ఎలా..?

వెస్టిండీస్‌తో క్రికెట్‌ అంటే గజగజా వణికిపోయే దేశాలు ఉండేవి.! అరవీర భయంకర బ్యాటర్లతో పాటు ఆరుడుగుల ఎత్తు నుంచి బంతులు విసిరే హేమాహేమీ ఆటగాళ్లు ఆ‌ జట్టు సొంతం. అందుకే 1960, 70 దశకాల్లో వెస్టిండీస్‌.. ప్రపంచ క్రికెట్‌ని శాసించింది. 1975, 1979లో జరిగిన తొలి రెండు వరల్డ్ కప్స్‌లోనూ విశ్వవిజేతగా నిలిచింది. 1983 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియాపై ఓటమి తర్వాత విండీస్‌ క్రమక్రమంగా ఆటపై పట్టు కోల్పోతూ వచ్చింది. అయినా ఆ జట్టును తర్వాతి కాలంలో ముందుండి నడిపించిన లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. అలా వ్యక్తిగత ప్రదర్శనలతో ఆధారపడుతూ వచ్చిన వెస్టిండీస్‌ ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌కి క్వాలిఫై అవ్వలేని స్టేజీకి ఎందుకు వచ్చింది..?

అసలు కారణాలు తెలుసుకోకుండా ప్లేయర్లను నిందిస్తే ఎలా?
నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ లాంటి పసికూన జట్లపై క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. క్రికెట్ హిస్టరీలో తొలిసారి వెస్టిండీస్‌ ప్రపంచ కప్‌కు క్వాలిఫై అవ్వకపోవడంతో వెటరన్ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఆ జట్టుపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత వెస్టిండీస్‌ క్రికెటర్లు దేశం కోసం ఆడరన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఈ విమర్శల్లో ఎలాంటి లాజిక్‌ లేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే వెస్టిండీస్‌ క్రికెట్ పతనం అవ్వడానికి కారణం ఆ జట్టు ఆటగాళ్లు కాదు.. ఆ దేశ క్రికెట్ బోర్డు..! జీతాలు, చెల్లింపుల విషయంలో వెస్టిండీస్‌ బోర్డుతో క్రికెటర్ల గొడవ దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. డబ్బులు ఇవ్వకుండా దేశం కోసం ఆడమంటే ఎవరుమాత్రం ఆడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

publive-image వరల్డ్ కప్ 2023 నుంచి వెస్టిండీస్ ఔట్ (PC: gettyimages)

టాలెంట్‌కు ఏ మాత్రం తీసిపోరు:
ప్రపంచంలో ఏ మూల క్లబ్‌ క్రికెట్ జరుగుతున్నా వెస్టిండీస్‌ ఆటగాళ్లు వాలిపోతున్నారంటే, ఆ దేశ ఆటగాళ్ల కోసం ఐపీఎల్‌ లాంటి లీగ్‌లు కూడా ఎగబడతున్నాయంటే వాళ్లకి ఆడడం రాదని అర్థమా..? ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశం తరఫున ఆడుతూనే లీగ్‌ల్లో కూడా ఆడుతుంటారు కదా. కానీ వెస్టిండీస్‌ ప్లేయర్ల మాత్రమే అలా ఎందుకు లేరు..? ఎందుకంటే బోర్డుతో కలిసి పని చేయడం ఇష్టం లేదు కాబట్టి. నిజానికి వెస్టిండీస్‌ బోర్డుతో ప్లేయర్ల ఇష్యూ చాలా కాలంగా ఉంది. అందుకే వెస్టిండీస్‌ టీమ్‌ ఒక సిరీస్‌కి మరో సిరీస్‌కి మారిపోతూ ఉంటుంది. 2016లో మాత్రం టీ20 వరల్డ్ కప్‌ కోసం సీనియర్లంతా ఏకమయ్యారు. వెస్టిండీస్‌ని ఛాంపియన్‌ చేశారు. అయినా బోర్డు తీరులో మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. అప్పటికీ ఇప్పటికీ బోర్డు తీరు అలానే ఉండడంతో విండీస్‌ ఆటగాళ్లు సైతం ఎక్కువగా క్లబ్‌ క్రికెట్‌పైనే దృష్టిపెడుతున్నారు. అందుకే ప్రపంచంలో టీ20లీగ్‌ ఏ దేశంలో జరిగిన విండీస్‌ ఆటగాళ్లే ప్రధాన ఆకర్షణ. ఇలా టీ20మైకంలో టెస్టు క్రికెట్‌ను ఆడడం మర్చిపోయారు కరేబియన్ వీరులు. ఆ తర్వాత వన్డేలపై కూడా పట్టు కోల్పోయారు. టీ20ల్లో మాత్రం ఇప్పటికీ విండీస్‌ మంచి జట్టుగానే ఉంది. ఎందుకంటే వివిధ దేశాల్లో ఆడుతున్న లీగుల పుణ్యమది. ఇలా కేవలం టీ20లు మాత్రమే ఆడే దుస్థితికి రావడం కేవలం బోర్డు వల్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు