AI : రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ సాంకేతికత ప్రస్తుతం యుద్ద విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా(America) తాజాగా ఓ యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏఐ సమర్థవంతంగా పూర్తి చేసింది.
కాలిఫోర్నియా(California) లోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఏఐ నడుపుతున్న ఎఫ్-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్(Air Force) సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంతో ఏఐ విమానం పోటీ పడి నడిపింది. శత్రువిమానాలపై పైచేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతల విన్యాసాల్లో ఏఐ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది.
ఏఐ యుద్ధ విమానంలో ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు. ‘‘ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం భద్రతా పరంగా ఓ పెద్ద రిస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతిక ఉండాల్సిందే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధాల ప్రయోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ సాంకేతికతకు ఉందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
ఈ సాంకేతిక ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్‌ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 1000 మానవరహిత, ఏఐ ఆధారిత యుద్ధవిమానాల ఫ్లీట్ ఏర్పాటే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది.
Also read: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులు శుభవార్త!