విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ రాశారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళానికి ముగింపు పలకాలని లేఖలో విపక్షాలను ఆయన కోరారు. సభలో గందర గోళ పరిస్థితుల నేపథ్యంలో పలు కీలకమైన బిల్లులపై చర్చ జరగుకుండా ఆగి పోతోందని ఆయన లేఖలో తెలిపారు.
విపక్షాలకు రాసిన లేఖను అమిత్ షా ట్వీట్ చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా వుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సహకారాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. అతి ముఖ్య ఈ విషయంలో విపక్షాలు కేంద్రానికి సహకరిస్తాయని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
లోక్ సభలో రభస నడుస్తుండగానే కేంద్రం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ)బిల్లును ప్రవేశ పెట్టింది. బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో విపక్షాలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. సభలో నినాదాలు, ఆందోళనలు చేస్తున్న వారికి కేంద్రానికి సహకారం అందించే విషయంలో గానీ, సహకార సంఘాల విషయంలో గానీ శ్రద్ద లేదని ఫైర్ అయ్యారు.
వారికి దళితుల, మహిళ సంక్షేమ పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఆందోళనలు విరమించి బిల్లుల ఆమోదానికి సహకరించాలని కోరారు. కానీ విపక్షాలు ఆందోళన విరమించలేదు. దంతో ఓ వైపు ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే బిల్లును మూజు వాణి ఓటుతో ఆమోదించింది.