కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అగస్టు 28, 29 తేదీల్లో ఆయన రెండు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. మొదట వచ్చే నెల 28న ఆయన తమిళనాడుకు చేరుకుంటారు. అక్కడ రామేశ్వరం ఆలయానికి వెళతారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ పరివర్తన యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అమిత్ షా తెలంగాణకు చేరుకుంటారు. హైదరాబాద్ లో బీజేపీ నేతలతో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి నేతలను అడిగి తెలుసుకోనున్నారు. పార్టీ పని తీరును పరిశీలించి బీజేపీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.
పార్టీకి చెందిన అన్ని మోర్చాలు, పార్టీ నేతలు, ఆఫీస్ బేరర్లతో సంస్థాగత సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. పార్టీకి చెందిన అతి ముఖ్యమైన 12 మంది నేతలతో ఆయన రోజంతా సమావేశం అవుతారని సమాచారం. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుని మార్పు తర్వాత అమిత్ షా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తుండటం గమనార్హం. ఇది ఇలా వుంటే ఈ రోజు అమిత్ షాతో బండి సంజయ్ సమావేశం అయ్యారు.
తెలంగాణలో ఉత్సాహంగా పని చేయాలని అమిత్ షా తనకు సూచించారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించానన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయం కోసం అందరూ కృషి చేయాలని అమిత్ షా చెప్పారన్నారు. బండి సంజయ్ తో భేటీ గురించి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.