అమెరికా నుంచి బ్రిటన్ వరకు.. ఎక్కడ చూసినా లీడర్లు మనోళ్లే!

భారతీయ మూలాలున్న వారిలో చాలామంది ఇతర దేశాల్లోని రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లోనూ ఇండియన్ సంతతి లీడర్లు పోటీలో ఉన్నారు. ఆ లీడర్ల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
అమెరికా నుంచి బ్రిటన్ వరకు.. ఎక్కడ చూసినా లీడర్లు మనోళ్లే!

Foreign Politicians of Indian Origin: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌, సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పర్సాద్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ, పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియో కోస్టా..! ఏంటీ ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానుల పేర్లు చదువుతున్నారని ఆలోచిస్తున్నారా? ఇదంతా పక్కింటోళ్ల వ్యవహారం కాదండోయ్.. ఇప్పుడు చెప్పిన పేర్లన్ని మన ఇండియన్స్‌వే. అవును.. భారతీయ మూలాలున్న వారిలో చాలామంది ఇతర దేశాల్లోని రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లోనూ ఇండియన్ సంతతి లీడర్లు పోటీలో ఉన్నారు.

అమెరికా ఎన్నికల్లో ఈ సారి కూడా ఇండియన్స్‌ గురించే చర్చ..! 2024 అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పేరును ఖ‌రారు చేయగా.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ (JD Vance) పేరును కూడా ప్రక‌టించారు. ఈ జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి (Usha Chilukuri) మ‌న తెలుగ‌మ్మాయే. జేడీ వాన్స్ పొలిటికల్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఉషా కీల‌క పాత్ర పోషించారు. ఉషా చిలుకూరి త‌ల్లితండ్రుల‌ది ఆంధ్రప్రదేశ్‌. కానీ ఆమె పుట్టింది మాత్రం కాలిఫోర్నియాలో. శాన్ డియాగో శివారు ప్రాంతంలో ఆమె పెరిగారు.

జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంప‌తుల‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భ‌ర్త జేడీ వాన్స్ పొలిటిక‌ల్ జ‌ర్నీలో ఉషా ఎంతో స‌హ‌క‌రించారు. భ‌ర్త చేప‌ట్టిన రాజ‌కీయ ప్ర‌చారాల్లో ఆమె కీల‌క పాత్ర పోషించారు. 2016, 2022 సేనేట్ క్యాంపేన్‌లో ఆమె స‌హ‌క‌రించారు. 2018 నుంచి ఒహియో నుంచి ఓటింగ్ కోసం రిప‌బ్లిక‌న్ పార్టీలో ఆమె రిజిస్టర్ చేసుకున్నారు.

అటు ఇటివలి ముగిసిన UK సార్వత్రిక ఎన్నికలలోనూ భారతీయ సంతతి నేతలు సత్తా చాటారు. ఈ సారి రికార్డు స్థాయిలో 26 మంది భారతీయ సంతతి పార్లమెంటు సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రుషి సునాక్‌ (Rishi Sunak) కూడా భారత సంతతికి చెందినవారే. గత యూకే ప్రస్తుత హౌస్ ఆఫ్ కామన్స్‌లో 15 మంది భారతీయ సంతతికి చెందిన ఎంపీలు ఉండేవారు. ఈ సారి ఏకంగా 26మంది బ్రిటిష్-ఇండియన్ అభ్యర్థులు గెలవడం విశేషం. UKలో జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 107 మంది భారతీయ సంతతి అభ్యర్థులు పోటీ చేశారు.

బ్రిటన్‌ కన్జర్వేటివ్‌కు చెందిన ప్రీతి పటేల్ 2024 UK సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సెక్స్‌లోని వితం సీటును నిలబెట్టుకున్నారు. పటేల్ జూలై24, 2019 నుంచి సెప్టెంబర్ 6, 2022 వరకు హోం డిపార్ట్‌మెంట్ స్టేట్ సెక్రటరీగా పనిచేశారు. మే 2010 నుంచి విథమ్‌కు పార్లమెంటులో కన్జర్వేటివ్ సభ్యునిగా ఉన్నారు. అటు లీసెస్టర్ ఈస్ట్ సీటును కన్జర్వేటివ్ అభ్యర్థి శివాని రాజా దక్కించుకున్నారు. మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ సభ్యురాలు, భారతీయ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ ఫేర్‌హామ్ స్థానంలో విజయం సాధించారు. ఇక బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్థానం నుంచి లేబర్ పార్టీకి చెందిన ప్రీత్ కౌర్ గిల్ తిరిగి ఎన్నికయ్యారు.

2021 ఇండియా స్పోరా గవర్నమెంట్ లీడర్స్ లిస్ట్ ప్రకారం 200 కంటే ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు 15 దేశాలలో నాయకత్వ స్థానాలను ఆక్రమించి ఉన్నారు. వారిలో 60 మందికి పైగా క్యాబినెట్ పదవులను కలిగి ఉన్నారు. కమలా హారిస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె తమిళ మూలాలున్న మహిళ. అటు బాబీ జిందాల్ 2008 నుంచి 2016 వరకు అమెరికా లూసియానా గవర్నర్‌గా పనిచేశారు. అతను పంజాబీ సంతతికి చెందినవాడు. ఇక నిక్కీ హేలీ 2017 నుంచి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో యునైటెడ్ స్టేట్స్ రాయబారిగా పనిచేశారు. ఆమె సిక్కు సంతతికి చెందిన మహిళా. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వందల మంది భారతీయ సంతతి వ్యక్తులు ఇతర దేశాల్లో కీలక స్థానాల్లో కీలక పదవులను చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు