Russia On Lok Sabha Elections: భారత్ లో లోక్ సభ ఎన్నికల జరుగుతున్న వేళ రష్యా ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ పార్లమెంటరీ ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి.. దేశంలోని అంతర్గత రాజకీయ పరిస్థితులను "అసమతుల్యత" చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు వ్యతిరేకంగా జరిగిన హత్యా కుట్రలో భారతీయ పౌరుల ప్రమేయానికి సంబంధించి అమెరికా ఇంకా నమ్మదగిన సాక్ష్యం అందించలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
ALSO READ: ముందు RR ట్యాక్స్ గురించి చెప్పు.. సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫైర్
భారతదేశంలో మత స్వేచ్ఛపై అమెరికా నివేదికను ప్రస్తావిస్తూ, భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై అమెరికాకు అవగాహన లేదని జఖరోవా అన్నారు. "అమెరికా మత స్వేచ్ఛపై 'నిరాధార ఆరోపణలు' చేస్తూనే ఉంది," అని జఖరోవా పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ ఛానెల్ RT న్యూస్ పేర్కొంది. ఇలా చేయడం భారతదేశానికి "అగౌరవం" అని ఆమె పేర్కొన్నారు. "భారతదేశంలో అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేయడం, సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడమే అమెరికా లక్ష్యమని ఆమె అన్నారు.
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్ (USCIRF) తన తాజా నివేదికలో, మత స్వేచ్ఛ, అనేక ఇతర సమస్యలపై భారతదేశాన్ని విమర్శించింది. ఆ నివేదికలో భారతదేశంతో పాటు మరో 16 దేశాలను "ప్రత్యేక ఆందోళన కలిగిన దేశాలు"గా పేర్కొనాలని పిలుపునిచ్చింది. "మత స్వాత్రంతం, విశ్వాసం హక్కులను ఉల్లంఘనలకు పాల్పడిన దేశాలుగా పేర్కొంది.
కాగా, యూఎస్ కమిషన్ (USCIRF) ఇచ్చిన నివేదికపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఘటిగా స్పందించింది. యూఎస్ కమిషన్ నివేదికను "పక్షపాతం" అని పేర్కొంది. అలాగే USCIRF తన వార్షిక నివేదికలో భాగంగా భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రచురించడం కొనసాగిస్తోందని మండిపడింది.