అంబటి రాయుడును అడ్డుకున్న అమరావతి రైతులు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. రాజధాని అమరావతి ప్రాంతం వెలగపూడిలోని వీరభద్రస్వామి ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు. విషయం తెలుసుకున్న రాజధాని రైతులు రాయుడిని అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు.

New Update
అంబటి రాయుడును అడ్డుకున్న అమరావతి రైతులు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అమరావతి పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వెలగపూడిలో రాయుడును రాజధాని రైతులు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి విచ్చేశారు. విషయం తెలుసుకున్న రైతులు ఆలయం వద్దకు వచ్చారు. అమరావతికి సంఘీభావం తెలపాల్సిందిగా రాయుడును కోరారు. మీరు ఆడిన ప్రతి మ్యాచ్‌లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని.. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జై అమరావతి నినాదం చేయాలని అడిగారు. దీంతో కంగుతిన్న రాయుడు అమరావతి ఎక్కడికి కదలదని సమాధానం దాటవేశారు. రైతుల దీక్షా శిబిరానికి రావాల్సిందిగా రైతులు కోరగా.. ఈసారి వచ్చినప్పడు తప్పనిసరిగా వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొంతకాలం క్రితం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగ సభల్లో సీఎం జగన్‌ ప్రసంగాలను పొగుడుతూ ట్వీట్స్ చేయడంతో పాటు క్యాంప్ ఆఫీసులో ఆయనను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వైసీపీ నుంచి ఆయన రాజకీయం అరంగేట్రం ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన రాయుడు తాను ఏ రాజకీయా పార్టీలో లేనని.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే క్రికెట్‌కు గుడ్ బై చెప్పానని.. ప్రస్తుతం తన దృష్టంతా సమాజానికి సేవ చేయడంపైనే ఉందన్నారు.

వైసీపీ నేతలు మాత్రం రాయుడు తమ పార్టీ నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు. గుంటూరు జిల్లా నుంచే పోటీ కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా గుంటూరు జిల్లాలో ఆయన తరుచుగా పర్యటిస్తున్నారు. ఇటీవల ముట్లూరులో పర్యటించిన రాయుడు స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విరాళం అందజేశారు. పాఠశాలలో సౌకర్యాల ఏర్పాటుకు ఆ నిధులను వినియోగించాలని సూచించారు. పాఠశాలకు పూర్వ వైభవాన్ని చేకూర్చుతానని హామీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది రాయుడిని ఘనంగా సత్కరించారు.

వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు పరోక్షంగా స్పందించడం ఆసక్తి రేపింది. వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లడం సహజమేనని.. అలాంటివారి మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను చూసినంత వరకు ప్రభుత్వంపై ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకత లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఆయన కచ్చితంగా వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతిలో రాయుడు పర్యటించడం.. రాజధాని రైతులు అడ్డుకోవడం చర్చనీయాంశం అయ్యాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు