తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఊహించని అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చింది. రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఇక్కడి నుంచి రాజ్యసభ బరిలో దించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కేకే రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సింఘ్వి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన సీటు ఖాళీ అయ్యింది.
దీంతో సునాయసంగా గెలిచే అవకాశం ఉండడంతో ఇక్కడి నుంచి అభిషేక్ మను సింఘ్విని బరిలోకి దించాలని కాంగ్రస్ నిర్ణయించింది. ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆయన రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇక్కడ రాజ్యసభ స్థానం ఖాళీ అయిన నాటి నుంచి అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం దక్కని అనేక మంది సీనియర్ నేతలు తమకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ తో పాటు హైకమాండ్ చుట్టూ తిరిగారు.
కానీ ఊహించని విధంగా రాజస్థాన్ కు చెందిన సీనియర్ న్యాయవాది, పార్టీ కీలక నేత అభిషేక్ మను సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది ఏఐసీసీ. దీంతో తమకు అవకాశం వస్తుందని భావించిన రాష్ట్ర నేతలకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ తన అభ్యర్థిని పోటీలో ఉంచుతుందా? లేదా ఉంచదా? అన్న అంశంపై క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో లేకపోతే అభిఏక్ మను సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.