Raghu Rama Krishna Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ (Hyderabad)నుండి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. రఘురామకృష్ణంరాజు సుమారు నాలుగేళ్ల తర్వాత సంక్రాంతి పండుగకు సొంతూరు భీమవరం (Bhimavaram) వెళుతున్నారు. ఆయన రాక సందర్భంగా స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారు భారీ గజమాలతో రఘురామకు స్వాగతం పలికారు. ఆయనకు స్వాగత చెప్పడానికి వచ్చిన అభిమానుల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలే ఉండటం గమనార్హం.
భీమవరం రావడానికి ముందు రఘురామ ముందస్తుగా హైకోర్టును (High Court) ఆశ్రయించారు. సంక్రాంతి కావడంతో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, ఉత్తర్వులను పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 41ఏ ప్రొసీజర్ ఫాలో అవుతూ రఘురామకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా రఘురామ కృష్ణం రాజు అభిమానులతో మాట్లాడుతూ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాను..ఎంతో ప్రేమతో ఆహ్వానం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో మరచిపోలేను. నన్ను అన్యాయంగా జైల్లో పెట్టినప్పటినుండి చంద్రబాబు, లోకేష్ అందించిన సహకారం..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన మద్దతు జీవితంలో మర్చిపోలేను. కష్టంలో ఉన్నప్పుడు మనవాళ్లేవరో పరాయి వాళ్లేవరో తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వస్తున్న నాకు స్వాగతం పలుకుతున్నందుకు నా జన్మ ధన్యమైందని అన్నారు. నాకు ఇంత ఆదరణ రావడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డికి కూడా అర్హత ఉన్న లేకపోయినా ఆయనకు ధన్యవాదాలు. ఈ విధంగా జరగడం దురదృష్టం. ఇప్పటికీ నేను రాకుండా అపడానికి చాలా ప్రయత్నించారు. కోర్టు అనుమతితో పోలీసుల సహకారంతో ఇక్కడికి వచ్చాను. పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి :Harish Rao: ప్రజలు ఊరుకుంటారా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరబాద్ నుంచి బయలు దేరే ముందుకూడా రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో తన లోక్ సభ సభ్యత్వానికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తానన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న అనంతరం మంచి రోజు చూసుకుని పదవికి, పార్టీకి గుడ్ బై చెబుతానన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలో జనసేనతో పొత్తు కలిగి ఉన్న బీజేపీ కూడా భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానాన్ని కోరుకునే పార్టీలో చేరుతానన్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు.