Adrusyam Review: థ్రిల్లింగ్ సినిమా.. చూడటం మొదలు పెడితే.. చివరి వరకూ కదలరంతే!

నేనే చంపాను అంటున్న అమ్మాయి.. తలలు పట్టుకున్న పోలీసులు.. అడవిలో ఆమె చెప్పిన చోట దొరికిన రెండు డెడ్ బాడీస్.. అక్కడే దొరికిన సీఐ వాచ్.. ఇంతకీ ఆ హత్యలు చేసింది ఆ అమ్మాయేనా? అసలేం జరిగింది? తెలుసుకోవాలంటే అదృశ్యం సినిమా చూడాల్సిందే. వివరాలు ఆర్టికల్ లో ఉన్నాయి. 

New Update
Adrusyam Review: థ్రిల్లింగ్ సినిమా.. చూడటం మొదలు పెడితే.. చివరి వరకూ కదలరంతే!

Adhrusyam Movie Review: అకస్మాత్తుగా ఒక అమ్మాయి.. అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. అక్కడంతా చాలా హడావుడిగా ఉంది.. ఆ హడావుడి మధ్యలో స్టేషన్ లోకి వెళ్లిన ఆమె.. సీఐ గారు కావాలి అని అడుగుతుంది. అక్కడ కానిస్టేబుల్ సీఐ లేరు.. ఎస్ఐ ఉన్నారు.. వెళ్లి కలవండి అని చెబుతాడు. కానీ, ఆ అమ్మాయి నాకు సీఐ మాత్రమే కావాలి అంటూ గట్టిగ పట్టుబడుతోంది. ఈలోపు అక్కడ ఉన్న ఎస్ఐ వచ్చి ఆమెను సీఐ లేరు.. ఇప్పుడు స్టేషన్ లో నాకు చెప్పవచ్చు చెప్పండి అంటాడు. దానికి ఆ అమ్మాయి.. నేను ఒక హత్య చేశాను అని చెబుతుంది. దాంతో.. పోలీస్ స్టేషన్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఎస్ఐ షాక్ లోనే ఏమిటి అని అడుగుతాడు. నేను ఒక హత్య చేశాను. బాడీ అడవిలో పాతిపెట్టేశాను అని చెబుతుంది. దీంతో వివరాలు చెప్పమని ఎస్ఐ అడుగుతాడు. మిగిలిన వివరాలు మీ సీఐకి మాత్రమే చెబుతాను అని అంటుంది. అసలు ఆమె ఆ సీఐ మాత్రమే ఎందుకు కావాలని అడుగుతోంది? ఆ అమ్మాయి మర్డర్ నిజంగా చేసిందా? చేస్తే ఎవరిని చేసింది? ఈ కథ చదువుతుంటేనే మీకు ఇన్ని ప్రశ్నలు వచ్చాయి కదా.. మరి ఇదే సినిమా అయితే.. కచ్చితంగా సీట్ ఎడ్జ్ కి చేరుకొని ఉత్కంఠతో రెప్పవేయకుండా చూసేస్తారు.. కదా.! 

అవును థ్రిల్లర్ సినిమాలు (Adhrusyam Review) మీకు ఇష్టం అయితే.. మీకు సూపర్ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఈ సినిమా కచ్చితంగా అందిస్తుంది. ఈ సినిమా అదృశ్యం. అయితే, ఇది థియేటర్లలో లేదు. ఓటీటీలోనే ఉంది. ఎందుకంటే, ఇది 2022లో వచ్చిన ఇని ఉతరమ్ మళయాళ మూవీకి తెలుగు వెర్షన్. అప్పట్లో మలయాళంలో సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దానిని ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి ఈటీవీ విన్ ఓటీటీలో సైలెంట్ గా తీసుకువచ్చేశారు. 

Also Read: ఇకపై పూర్వీకులు తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవడం ఈజీ!

అసలు మలయాళ సినిమా అంటేనే.. ఇప్పుడు ఒకరకమైన క్రేజ్ నడుస్తోంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో మలయాళం ఇండస్ట్రీని మించింది లేదు. చిన్న లైన్ తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని కదలకుండా కూచోపెట్టే సినిమాలు తీసుకొస్తారు. ఇది కూడా అలంటి సినిమానే. ఈ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన ఫ్యాన్  బేస్ ఉంది. ఆ ఫ్యాన్స్ కి అదృశ్యం సినిమా కచ్చితంగా బాగా నచ్చుతుంది. 

సినిమాలో కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. పైన చెప్పిన కథే. కాకపోతే, ఆ చిన్న లైన్ ను గ్రిప్పింగ్ గా నడిపించిన స్క్రీన్ ప్లే లోనే  అసలు మజా ఉంది. అంతేకాదు.. సినిమాలో రాజకీయాలు.. పోలీసు వ్యవస్థ మధ్యలో ఉండే సంబంధాలను జాగ్రత్తగా వాడుకున్నారు. ఒక క్రైమ్ జరిగినపుడు ఉండే ప్రొసీడింగ్స్ ని చాలా కచ్చితంగా చూపించే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా విషయాన్ని పక్కదారి పట్టించకుండా.. ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా.. హత్య.. దాని వెనుక కథ.. నడిపించుకుంటూ వెళ్లారు. దీంతో సినిమా చూస్తున్నంత సేపూ మన చేయి కచ్చితంగా రిమోట్ మీదకు వెళ్లదని చెప్పవచ్చు. 

ఆకాశ‌మే నీ హ‌ద్దురా ఫేమ్ అప‌ర్ణ బాల‌ముర‌ళి లీడ్ రోల్  చేసింది. అద్భుతమైన నటనతో మంచి ఎక్స్ ప్రెషన్స్ తో అపర్ణ ఆకట్టుకుంది. ఇక మనకు తెలిసిన వారు ఎవరూ సినిమాలో లేరు కానీ, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అదరగొట్టేశారని చెప్పాలి. 

టెక్నీకల్ గా కూడా సినిమా చాలా బావుంది. అడవిలో తీసిన సీన్స్.. డ్రోన్ షాట్స్.. ఫొటోగ్రఫీ చాలా నీట్ గా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమాకి సంగీతం ఇచ్చిన ఫేమ్ షీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. నేపధ్య సంగీతం సినిమాను మరింత థ్రిల్లింగ్ గా నిలబెట్టింది. 

మొత్తంగా చూసుకుంటే.. థ్రిల్లర్.. సస్పెన్స్.. క్రైమ్ ఈ అంశాలను ఇష్టపడితే ఈ సినిమా  మంచి సినిమా అనిపిస్తుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా ఆడపిల్లలు.. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. ఈటీవీ విన్ లో ఉంది.. ఒకసారి రిమోట్ క్లిక్ చేయండి.. సరిగ్గా పదినిమిషాల్లో రిమోట్ పక్కన పెట్టి.. సినిమాలో లీనమైపోతారు!

చివరగా.. ఆడపిల్లలు కాస్త ధైర్యం చేస్తే.. ఎలాంటి అద్భుతాలు చేయగలరో అదృశ్యం సినిమా చూపిస్తుంది. 

గమనిక: ఈ రివ్యూలో అభిప్రాయలు రచయిత వ్యక్తిగతమైనవి. రచయిత వ్యక్తిగత కోణంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు మాత్రమే.

Advertisment
తాజా కథనాలు