కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మరో రాజ్యసభ సీటును దక్కించుకుంది. కే కేశవరావు రాజీనామాతో ఇటీవల జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయన సింఘ్వీ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సింఘ్వి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన సీటు ఖాళీ అయ్యింది. దీంతో సునాయసంగా గెలిచే అవకాశం ఉండడంతో ఇక్కడి నుంచి అభిషేక్ మను సింఘ్విని బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక్కడ రాజ్యసభ స్థానం ఖాళీ అయిన నాటి నుంచి అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం దక్కని అనేక మంది సీనియర్ నేతలు తమకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ తో పాటు హైకమాండ్ చుట్టూ తిరిగారు. కానీ.. అనూహ్యంగా అభిషేక్ మను సింఘ్వీని బరిలోకి దింపింది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం.