అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ రాజకీయ ఒత్తిళ్లతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సీఐ మృతదేహానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టిన 9 నెలల కాలంలో.. సుమారు ఐదు నెలల నుంచి వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. వైసీపీ లీడర్లను కొన్ని కేసుల్లో నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ కారణంతోనే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసు. ఏదేమైనా సీఐ మృతి చాలా బాధాకరం. ఆయన ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరుతాం అని ఎమ్మెల్యే తెలిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని.. కుటుంబ కలహాలతో సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.